2.92 లక్షల మంది  విద్యార్థులకు ‘తెలంగాణ దర్శిని’ .. పర్యాటక శాఖ నుంచి రూ.11.69 కోట్లు మంజూరు

2.92 లక్షల మంది  విద్యార్థులకు ‘తెలంగాణ దర్శిని’ .. పర్యాటక శాఖ నుంచి రూ.11.69 కోట్లు మంజూరు
  • 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యా, సాంస్కృతిక విజ్ఞాన యాత్రలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మన చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రత్యక్షంగా పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న 2,92,286 మంది విద్యార్థులకు విద్యా, సాంస్కృతిక విజ్ఞాన యాత్రలు నిర్వహించనుంది. ఇందుకుగాను పర్యాటక శాఖ తరఫున రూ.11.69 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యార్థులను తరగతి గదుల బోధనకే పరిమితం చేయకుండా, తెలంగాణలోని చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాల విశిష్టతను ప్రత్యక్షంగా చూపించడమే ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమ ఉద్దేశమని టూరిజం శాఖ అధికారులు పేర్కొన్నారు. పుస్తకాల్లో చదువుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో చూసి తెలుసుకోవడం ద్వారా విద్యార్థుల విజ్ఞాన పరిధి విస్తృతమవుతుంది. చిన్నతనం నుంచే వారసత్వ సంపద పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన, బాధ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ), విద్యాశాఖ సమన్వయంతో ఈ యాత్రలను నిర్వహించనున్నాయి. ఈ విజ్ఞాన యాత్రల నిర్వహణకు మొత్తం రూ.26.30 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో విద్యాశాఖ వాటా రూ.14.61 కోట్లు కాగా, పర్యాటక శాఖ వాటా రూ.11.69 కోట్లుగా ఉంది. యాత్రలో భాగంగా ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.900 చొప్పున రవాణా, ఇతర పర్యాటక సదుపాయాలు కల్పిస్తారు. ఇందులో ‘సమగ్ర శిక్షా అభియాన్’ కింద విద్యాశాఖ రూ.500, పర్యాటక శాఖ రూ.400 చొప్పున భరించనున్నాయి.

కట్టడాలు సజీవ పాఠశాలలు: మంత్రి జూపల్లి

తెలంగాణ దర్శిని కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం లభిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణకు ఘనమైన చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వంతో పాటు అపురూపమైన కట్టడాలు, ఆలయాలు, సహజ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి క్షేత్రస్థాయి పర్యటనలు విద్యార్థులకు మరింత ఆసక్తికరమైన, అర్థవంతమైన అభ్యాసన అనుభవాన్ని ఇస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, మ్యూజియంలు, ప్రకృతి అందాలు విద్యార్థులకు సజీవ పాఠశాలలుగా నిలుస్తాయన్నారు.